ఆధ్యాత్మికత సోమరితనం కాదు. వేదాంతం మత్తుమందు కాదు. మానవత్వపు విలువలను తెలియచేస్తూ, మానవజాతి పురోగతికి మార్గనిర్దేశం చెయ్యటమే భారతీయ సంస్కృతి లక్ష్యం. యువతలో చైతన్యం వచ్చినప్పుడే సమాజానికి ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉంటుంది అని అంతర్జాతీయంగా ప్రపంచమంతా తన వైపు చూచే విధంగా ఎలుగెత్తి చాటిన మహనీయుడు స్వామి వివేకానంద. భగవద్గీతలో కృష్ణుడు అర్జునునికి చెప్పిన ‘క్లైబ్యం మాస్మగమః... ’ (పార్థా! పిరికితనం పనికిరాదు. క్షుద్రమైన హృదయదౌర్బల్యాన్ని విడిచి పరాక్రమంతో నిలబడు) అనే శ్లోకం అంటే వివేకానందునికి చాలా ఇష్టం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, వేదాంత గ్రంథాలను ఎలా చదవాలో, ఎలా అర్థం చేసుకోవాలో ఆధునిక సమాజానికి సప్రమాణంగా ఉదాహరణలు, ఆత్మవిశ్వాసంతో ఆకర్షణీయంగా బోధించిన మహావక్త, దార్శనికుడు ఆయన. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వలన భారతీయులలో కలిగిన ఆత్మన్యూనతాభావం, గందరగోళం, భయం, పిరికితనం మొదలైన మానసిక వికారాలను పోగొట్టి, వ్యక్తిత్వవికాసాన్ని కలిగించి కార్యోన్ముఖులను చేయటానికి వివేకానందుని బోధనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ‘‘పేదరికం పోవాలి. ఆకలితో ఎవరూ బాధపడకూడదు. ఇనుపకండరాలతో ఉక్కునరాలతో దృఢమైన ఆరోగ్యవంతమైన దేహం ఉండాలి. ఆటపాటలతో ఉల్లాసంగా ఉండాలి. అప్పుడే వేదాంతం అర్థమవుతుంది. నీ లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకు. అప్పుడు ప్రపంచం మొత్తం నీకు మోకరిల్లుతుంది. కష్టపడి డబ్బు సంపాదించు. కాని దానితో బంధాన్ని పెంచుకోకు. సత్యానికి కట్టుబడి ఉంటే విజయం నెమ్మదిగా లభించవచ్చు. కానీ తప్పక లభిస్తుంది. ప్రతిదానినీ పరీక్షించు. ప్రయత్నించు. అప్పుడు మాత్రమే విశ్వసించు. దానిలో నీకు కనపడిన మంచిని అందరికీ పంచు. ఈ జీవితాన్ని ఇతరుల సేవకు సమర్పించు.’’ ఇలా సాగిన వివేకానందుని ప్రవచనాలలోని పరమార్థం మతబోధకాదు. హితబోధ. మానవునిలోని స్వార్థం, అసూయ, చెడుస్నేహాలు, పరా నుకరణం, అజ్ఞానాలను పారద్రోలి ఉత్తమునిగా తీర్చిదిద్దాలి. అప్పుడు సమాజంలోని కక్షలు కార్పణ్యాలు అంతరిస్తాయి. అంతటా ఉన్న పరమాత్మతత్త్వం అవతగమవుతుంది. ఈ భారతీయ తత్త్వాన్ని ప్రపంచం నాలుగుదిక్కులా చాటిచెప్పటానికి చాలా కష్టాలకు ఓర్చి వివేకానందుడు తూర్పు, పశ్చిమ దేశాలెన్నో పర్యటించారు. చికాగో విశ్వమత సమ్మేళనంలో ఆయన చేసిన ప్రసంగం చిరస్మరణీయం. యువతరాన్ని తీర్చిదిద్దే సూక్తులుఅసంఖ్యాకంగా అందిస్తున్న వివేకానందుని రచనలు యువతకు మార్గదర్శకాలు. ‘మేలుకో, నడు, లక్ష్యాన్ని సాధించు అనే ఉపనిషద్వాక్యమే వివేకానందుని నినాదం. దాని ఆచరణే మనం ఆయనకు చేసే అభివాదం. - డా. పాలపర్తి శ్యామలానందప్రసాద్ అందరికీ వివేకానంద జయంతి శుభాకాంక్షలు.. ఉదయాన్నే ఈ వ్యాసం సాక్షిదినపత్రికలో చూసాను,ఎంతో నచ్చింది, అందుకే ఇలాపోస్టుచేసాను... సేకరణ: సాక్షిదినపత్రిక |
January 12, 2012
మేలుకో, నడు, లక్ష్యాన్ని సాధించు
Subscribe to:
Post Comments (Atom)
ఆధ్యాత్మికత సోమరితనం కాదు. వేదాంతం మత్తుమందు కాదు. ......
ReplyDeletevery very excellent lines. nice article.