June 8, 2011

మనవారి దగ్గర మెప్పు అవసరమా ?


   
         మనవారి దగ్గర మెప్పు అవసరమా? అంటే అందరూ ఎందుకు అని అనడం నిజమే. నిజానికి మనిషి ఏ పని చేసినా కానీ తనకు ఒక రకమైన ప్రాధాన్యత వస్తుంది అన్న భావనలోనే చేస్తూ ఉంటాడు.


మనం ప్రతిరోజూ అనేక పనులు చేస్తూ ఉండడం సహజం కానీ అన్నీ మనకోసమే చేస్తున్నామా ? ఒకసారి అలోచించండి.... కొన్ని మనకోసం కొన్ని మనవాళ్ళ కోసం చేస్తూవుంటాం. మీరు మీ సొంత వాళ్ళకోసమే కష్టపడి ఒక ఫోటో కంప్యూటర్ లో తయారుచేశారు అనుకోండి, అది చూసిన వారు “అబ్బ ఎంత బాగా చేసావో....” అని ఒక్కమాట అంటే మీకు కలిగే ఆనందాన్ని ఒక్కసారి ఊహించుకోండి...నిజమేకదా మనం పడ్డ కష్టానికి ఎదో దక్కింది అని మీకు అనిపిస్తుందా లేదా? ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే...
అలాగే మీకోసం కష్టపడే వారిని గుర్తించడం మరిచిపోకండి.... ఇలా ఎందుకు రాస్తున్నాను అంటే, కొంత మంది మనుషుల స్వభావం ఎలా ఉంటుంది అని తెలియజేయడానికి మాత్రమే... మన ఇంట్లో రోజూ అమ్మ లేక మీ భార్య నో ఎవరో ఒకరు వంట చేస్తుంటారు. రోజూ రకరకాలైన రుచులు మనకు తినిపిస్తుంటారు. మనం తినేటప్పుడు ఒక్కసారైనా “ఈ రోజువంట చాలా బాగుంది ” అని అంటే మీ సొమ్ము ఎమీ పోదు కదా? జీవితంలో ఇలాంటి విషయాలను చాలా తేలిగ్గా కొట్టిపారేస్తుంటాం కానీ నిజజీవితంలో మాత్రం ఇవే ముఖ్యం. ఇలానే ఎన్నో విషయాలు మీ చుట్టూ జరుగుతూనే ఉంటాయి.

   కొందరు మనుషుల స్వభావం వేరుగా ఉంటుంది, వాళ్ళు తమవారి శ్రమని అస్సలు గుర్తించరు..నిజంగా వారికోసం మనం ఒక పనిచేస్తే ఎందుకు చేశామా అని అనిపించేట్లుగా వ్యవహరిస్తారు. కానీ బయట వారు తమకు ఒక చిన్న సాయం చేసినా వారికి దాసాను దాసులు అవుతుంటారు. మనవారికి లేని గుర్తింపు బయట వారికి అవసరమా ? అవసరమా అనడం కొంత వరకు తప్పుఅని అనిపించవచ్చు..కానీ గుర్తింపు అనేది అందరి మీదా ఒకేలా ఉండాలి....ఒకరిపై ఎక్కువ మరొకరిపై తక్కువ ఉండకూడదు కదా?

      మనంమేం పెద్ద సాయం చేస్తాం వాళ్ళకు, ఊరకే ఎదైనా సలహానో ఒకపనిని ఎలా చెయ్యాలి అనో  చెప్పివుంటాం.. కానీ కొందరు ఒక రకం ఇంట్లో వారు చెప్పింది అస్సలు పట్టించుకోరు ఒక చెవిన విని మరో  చెవిన వదిలి వేస్తుంటారు..మనం గంటలు తరబడి వారి చెవిలో శంఖం ఊదినా కానీ వారికి ఏ మాత్రం పట్టదు.. దీనికి ఒకచిన్న ఉదాహరణ చెప్తాను... మీ నాన్నకు ఒక చెక్కు వచ్చింది దాన్ని బ్యాంక్ లో ఎలా తీసుకోవాలో ఆయనకు తెలియదు. బహుశా మీకు తెలుసు మీరు అంతకు ముందు ఆ పని చేసివున్నారు అనుకుందాం..మీ నాన్నకు నాన్న ఇది అకౌంట్ పే చెక్కు అందుకని బ్యాంకులో డిపాజిట్ ఫాం నింపి చెక్ డ్రాప్ బాక్సులో వేస్తే చాలు మీ అకౌంట్ లో పడుతుంది అని మీరు చెప్పారు అనుకుందాం.మీ నాన్నగారు బ్యాంకుకు వెళ్ళి అక్కడ ఎవరినో అడిగి అదేపని చేసి ఇంటికి వచ్చి ఫలానా వ్యక్తి చాలా తెలివైన వాడు నాకు డిపాజిట్ ఫాం నింపి చెక్ డ్రాప్ బాక్సులో వేస్తే చాలు అని చెప్పాడు నేను అలానే చేసాను అని మీ ముందు చెప్తే మీకు ఎలా ఉంటుంది.. అది మీరు అంతకు మునుపు మీరు చెప్పినదే  కానీ మీరు చెప్పినపుడు మీ నాన్న బుర్రలో ఆ విషయం ఎక్కలేదు ఎవరో చెప్తే ఎక్కింది...ఇలాంటి సమయంలో మన మనసుకు ఎంత బాధ కలుగుతుందో కదా..?

       అందుకే ఒక్క విషయం ఙ్ఞాపకం ఉంచుకోండి... మనకోసం కష్టపడే వారిని ఒక కంట కనిపెట్టి ఉండండి...ఒకవేళ మీరు ఇలాంటి గుర్తించలేని నైజం కలవారైతే వెంటనే మీ గుణం మార్చుకోవడానికి ప్రయత్నించండి...మనకోసం పాటు పడే మనవాళ్ళను ముందు గుర్తించండి.......

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...