January 4, 2012

మా పాపాయి సంగతులు – (ముగ్గురికి ఆరుచెవులోళ్ళకి పట్టిస్తా....)    

    మాపాప పేరు సుహిత..(ప్రస్తుతం మూడో సంవత్సరం)....
కానీ నేను పెట్టిన పేరు మాత్రం రిపీటర్ అని,  ఎందుకంటారా?  మనం ఏం మాట మాట్లాడినా వెంటనే అదే మాటల్ని కొంచెం delay తో రిపీట్ చెయ్యడం మా పాప ప్రత్యేకత... నిజం చెప్పాలంటే  దానికి ఆ మాటలకి అర్దం కూడా తెలీదు. ఏదో అందరూ మాట్లాడుతున్నారు నేను కూడా మాట్లాడేయాలి అని అంతే.  కానీ మాపాప ఎంత గ్రేట్ తెలుసా?  పాటలు, పద్యాలు, డాన్స్  అన్నీ ఇరగదీసేస్తుంది (నాకు రానివి కూడా)

     ఒక్కోసారి తను మాట్లాడే మాటలు చూస్తే ఆశ్చర్యం, నవ్వు అన్నీ వస్తాయి.

ఉదా:     ఒకసారి నేను గుడికి వెళ్తున్నాను. నేను వస్తానని మారాం చేసింది, సరేనని చేసేదేం లేక తీసుకొని వెళ్తున్నాను...దారిలో ఒక దగ్గర చీకటిగా ఉంది, నేను పాప భయపడుతుందేమో ధైర్యం చెప్పాలి అని అనుకుంటున్నాను అంతే వెంటనే.... నా భుజం తట్టి మామా నీకేం పర్వాలేదు లే... నేనున్నాను లే   అని అంది. ఇక నాకైతే భలే నవ్వువచ్చేసింది. ఇలాంటి షాకులు చాలా ఉన్నాయి లేండి...

   అసలు అయితే ఏపనికి పక్కవాళ్ళమీద  ఆధారపడకూడదు అని ఇప్పటి నుండే ఎలా అలవాటయ్యిందో నాకు అర్దం కాదు... ఏ పని అయినా నువ్వు వద్దులే... నేను చేసుకుంటాలే.... ఎంత బాగా చేస్తానో చూడు అనేస్తుంది.
క్షణం కూడా తీరికలేకుండా ఇల్లంతా తిరిగేస్తూ సవరించేస్తుంటుంది. మర్చిపోయాను  మా పాప మహేష్‍బాబుకు సూపర్ ఫ్యాన్. మీరు అష్టాచెమ్మా సినిమా చూశారా? దానిలో హీరోయిన్ స్వాతి లాగా అన్నమాట. టీవీలో మహేష్‍బాబు సినిమా వచ్చిందో advertisements తో సహా అన్నీ చూడాల్సిందే, ఆ మా టీవీ వాడేమో వారానికోసారి అతడు సినిమా వెయ్యక మానడు, మాకు ఆ సినిమా భరించకా తప్పదు.. అసలు సినిమా పాటలంటే ఎరగని నా కంప్యూటర్‍లో అదేదే చిల్‍బులి (దూకుడు) పాట ఉందంటే అర్దం చేసుకోండి.. మహేష్‍బాబు ఫోన్ చేస్తే ఏం చెప్తావు అని అడిగితే వచ్చే సమాధానం వింటే దీనికిలాంటి మాటలు ఎవరు నేర్పించారా అని అనిపిస్తుంది.


       కానీ అందరి పిల్లల లాగా అన్నం తినడానికి మారాం చేసే గుణం మాత్రం ఉంది.....ఒక్కసారి అన్నం తినిపించేటప్పటికి బ్రహ్మదేవుడు దిగివస్తాడు. ఇక ఇలాకాదని కొన్నాళ్ళు  డైనోసార్ వస్తుంది తినని వాళ్ళను పట్టుకుపోతుందిఅని భయపెట్టి తినిపించాను..కొన్నాళ్ళకి అదంటే భయం పోయింది.తర్వాత  బుల్లేట్ బాబు వచ్చేస్తాడుఅని చెప్పి తినిపించాను. ఇప్పుడేమో ముగ్గురికి ఆరు చెవులుండే వాళ్ళు వచ్చి పట్టుకుపోతారు అని చెప్పి తినిపించేస్తున్నాం... నిజానికి ముగ్గురుకి ఆరు చెవులు కాక పదహారు ఉంటాయా ?   పాపం దానికేం తెలుసు...అలాగని లెక్కలు రావనుకుంటారేమో  1,2,3,4,5,6,7,8,9,10,23,46,78,94,45,3రూపాయలు  ఇలా అన్నీ వచ్చు....
ఇక ఈ భయం కూడా  పోతే ఇంకే కొత్తపదం సృష్టించాలో ఏమో ? కాస్త సలహా చెప్పరూ.......
Note: పాప అంటే నా మేనకోడలు....

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...